టాలీవుడ్ లో సీక్వెల్స్ టెన్షన్.. దెబ్బ మీద దెబ్బ


ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో టైర్ 1, టైర్ 2 హీరోలు ఏ సినిమా చేసిన రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నాం అంటూ ముందుగానే ఎనౌన్స్ చేసేస్తున్నారు. లేదంటే మూవీ షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు సడెన్ గా పార్ట్ 2కి సంబందించిన ప్రకటన కూడా ఇస్తున్నారు. అలాగే ప్రతి సినిమా కూడా కంప్లీట్ ఎండింగ్ పెట్టకుండా పార్ట్ 2కి కొనసాగింపు అనే విధంగా కథని ముగిస్తున్నారు.

కొన్ని సినిమాలకి ఈ పద్ధతి వర్క్ అవుట్ అవుతుంది. పార్ట్ 2పైన హైప్ క్రియేట్ అవుతోంది. అయితే కొన్ని మూవీస్ మాత్రం అసందర్భంగా ముగుస్తున్న ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగొస్తోంది. బాహుబలి సిరీస్, కేజీఎఫ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో సినిమాలు రెండు భాగాలుగా చేస్తే మరింత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టొచ్చని దర్శక, నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన కథ దశలోనే మొదలవడం వలన సస్పెన్స్ అంటూ మొదటి భాగంలో కంప్లీట్ గా విషయాన్ని ఓపెన్ చేయకుండా రెండో భాగానికి ఉంచుతున్నారు.


ఈ కారణంగా సినిమాల కథనం దెబ్బతిని డిజాస్టర్ అవుతున్నాయి. ముందుగా ఒక కథ మొత్తం చెప్పేసి దానికి ఫైనల్ గా నెక్స్ట్ జర్నీకి లీడ్ ఇచ్చే విధంగా ఉంటే సీక్వెల్స్ కి మంచి ఆధారం ఉండే అవకాశం ఉంది. అలా జరగకుండానే మొదటికథనే సగం సగం చెప్పాలని ప్రయత్నించడం వలన ఆరంభంలోనే అవరోధం ఎదురవుతుంది. శ్రీకాంత్ అడ్డాల చేసిన పెదకాపు రెండు భాగాలుగా ఎనౌన్స్ చేశారు. అయితే మొదటి భాగంలో చాలా అంశాలు ప్రొపెర్ గా ఓపెన్ చేయకుండా సీక్వెల్ కి అంటూ దాచారు. రిజల్ట్ ఏంటనేది అందరికి తెలిసిందే. అలాగే స్కంద మూవీలో కూడా రామ్ ని రెండు పాత్రలలో చూపించారు. ఒక క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ పూర్తిగా దయచేసి పార్ట్ 2కి అని చెప్పారు. సినిమా డిజాస్టర్ అయ్యింది.

డెవిల్ మూవీ కూడా రెండు భాగాలుగా అని చెప్పిన మొదటి భాగమే మెప్పించలేదు. దీంతో వీటి సీక్వెల్స్ ఆగిపోయాయి. సలార్ రెండు భాగాలుగానే ఎనౌన్స్ చేశారు. మొదటి పార్ట్ సక్సెస్ అయిన ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఇప్పుడు రవితేజ ఈగల్ కూడా రెండు భాగాలుగా అని చెప్పారు. కానీ మొదటి భాగానికే ఏవరేజ్ టాక్ వచ్చింది. దేవర మూవీ కూడా రెండు భాగాలుగానే రాబోతుందంట. అలాగే కల్కి 2898 ఏడీ రెండు పార్ట్శ్ గానే ప్లాన్ చేస్తున్నారు.  ఇలా సీక్వెల్ కల్చర్ ఇప్పుడు కొన్ని సినిమాల ఫలితాలని దెబ్బ తీస్తున్నాయని సినీ విశ్లేషకులు అంటున్న మాట.

Post a Comment

Previous Post Next Post