మనమే మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:

విక్రమ్ (శర్వానంద్) లండన్‌ లో సరదాగా జీవితం గడుపుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో అతని ప్రాణ స్నేహితుడు మరణించడంతో, అతని కొడుకు ఖుషి (మాస్టర్ విక్రమ్ ఆదిత్య) బాధ్యత విక్రమ్ మీద పడుతుంది. విక్రమ్ సుభద్ర (కృతి శెట్టి) అనే అమ్మాయితో కలసి, ఖుషిని పెంచాల్సిన పరిస్థితుల్లో ఉంటారు. సుభద్ర పెళ్లి ఇప్పటికే ఫిక్స్ అయినా, విక్రమ్, సుభద్ర, ఖుషి మధ్య క్రమంగా బంధం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో, అనుకోని వ్యక్తి ప్రవేశించి, వారి జీవితాల్లో కొత్త సమస్యలను తెస్తాడు. అసలు సుభద్ర ఎవరు? చివరికి వీరి ప్రయాణం ఎక్కడికి దారి తీసిందనేది అసలు కథ.


విశ్లేషణ:

ఈ కధ స్నేహం, ప్రేమ, బాధ్యతలు, అనుబంధాల మధ్య నడిచే ఒక భావోద్వేగ ప్రయాణం. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఇప్పటివరకు యాక్షన్ మరియు క్రైమ్ డ్రామాలకు పేరుపొందినప్పటికీ, ఈసారి పూర్తి ఎమోషనల్ సబ్జెక్టుతో మనమే సినిమా తీసుకువచ్చాడు. ఈ సినిమా చైల్డ్ సెంటిమెంట్ తో ప్రేమకథను ముడిపెట్టి ముందుకు సాగిస్తుంది. ఒక మంచి ఆలోచన, తల్లిదండ్రులకు దూరంగా ఉండే పిల్లలు తాము కోల్పోయే ప్రేమను అర్థం చేసుకోవడం.. అనే పాయింట్ తో పాటు ప్రేమలో నిజాయితీ ఉంటే దేహ ఆక్షరణకు దూరంగా ఉండటం.. అనేది మరొక లైన్ సినిమాలో హైలెట్ అవుతాయి. అయితే ఈ రెండు అంశాలను బ్యాలన్స్ చేయడం క్రమంలో కథనం మామూలుగా మారింది. 


అవసరం ఉన్నా లేకపోయినా వచ్చే బిట్ సాంగ్స్, పూర్తి పాటలు మరీ మేజిక్ చేసే స్థాయిలో లేవు. తొలి సగంలో కామెడీ, చిన్న చిన్న జోకులుతో టైం పాస్ అయినా కూడా ఎగ్జైటింగ్ గా అనిపించేది ఏదీ ఇంటర్వెల్ దాకా కనిపించదు. కృతి శెట్టి ఇంట్రో తర్వాత కొన్ని సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తాయి. రెండవ భాగంలో కథనాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం కూడా చాలా రొటీన్ గా ఉంటుంది. విక్రమ్, సుభద్రల ప్రేమకథను టెంప్లేట్ లో నడిపించారు. సహజంగా కాకుండా కృత్రిమత్వం కనిపించడం, వారి ఎమోషన్ ని మనం ఫీల్ చేయలేకపోవడం రెండవ భాగంలో ప్రధాన లోపాలు. 


పట్టుమని మూడేళ్లు లేని చిన్న బాబు దూరమవుతున్నప్పడు, ఆ బాధని చూసే ఆడియన్స్ ఫీలైతేనే దర్శకుడి లక్ష్యం నెరవేరుతుంది. కానీ, రెగ్యులర్ గా నడిపించడం వల్ల పాత్రల మధ్య సంబంధాలు సరిగా ఎస్టాబ్లిష్ కాకుండా కేవలం సన్నివేశాలు, డైలాగుల మీద ఆధారపడితే అవుట్ ఫుట్ తేడా కొట్టేస్తుంది. చివర్లో తులసి, సచిన్ కెడ్కర్ లు తామేం కోరుకుంటున్నామో శర్వాను వివరించే తీరు కూడా పెద్దగా హత్తుకునేలా అనిపించలేదు. 


టెక్నికల్ గా మనమేలో కొన్ని మంచి విషయాలున్నాయి. లండన్ విజువల్స్, సినిమాటోగ్రఫీ చాలా బాగా ఉన్నాయి. కారు ఛేజ్ ఫైట్ లాంటి చోట్ల విఎఫెక్స్ కొంచెం తేడా కొట్టినప్పటికీ ఓవరాల్ గా క్వాలిటీ చాలా కలర్ ఫుల్ గా ఉంది. సంగీతం దర్శకుడు, హేశం అబ్దుల్ వహాబ్ అందించిన పాటలు కొన్ని ఓకే అక్కడక్కడా కామెడీ సీన్స్ బాగున్నాయి. 


కారెక్టర్ పరంగా, శర్వానంద్ తన పాత్రలో మెప్పించాడు. కృతి శెట్టి అందంగా ఉంది కానీ నటన పరంగా గొప్పగా చెప్పడానికి క్యారెక్టర్ లో కంటెంట్ ఏమీ లేదు. ఇతర నటులు, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, తులసి, సచిన్ కెడ్కర్ మరియు సుదర్శన్ వారి పాత్రలలో పర్వాలేదు అనిపించారు. ఇతర టెక్నికల్ అంశాలలో, జ్ఞానశేఖర్ విఎస్ - విష్ణు శర్మ కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత పదును పెట్టాల్సింది.  ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఇది ఒకసారి చూడదగ్గ సినిమా. మరి ఆ వర్గం నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.


ప్లస్ పాయింట్స్:

🔹శర్వానంద్ క్యారెక్టర్

🔹సినిమాటోగ్రఫీ, లొకేషన్స్

🔹కొన్ని కామెడీ సీన్స్

🔹మ్యూజిక్


మైనస్ పాయింట్స్:

🔹కథ, కథనం

🔹ఏమోషన్ మిస్సవ్వడం

🔹సెకండ్ హాఫ్


రేటింగ్: 2.75/5

Post a Comment

Previous Post Next Post